Friday, June 12, 2015

గంగమ్మ నేలపై తొలిపాదం మోపిన స్థలం .....



గంగానది ఈ భూమ్మీదకు రావడానికి సంబంధించి ఒక కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. సగరుడనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్థం అశ్వమేథ యాగాన్ని చేశాడు. సగరుని వైభవాన్ని చూసిన ఇంద్రుడు తన పదవికి సగరుడు పోటీకి వస్తాడేమోననే భయంతో యాగాశ్వాన్ని అపహరించాడు. దానిని తీసుకుని వెళ్లి కపిలముని ఆశ్రమంలో కట్టివేశాడు. అశ్వాన్ని రక్షించడానికి బయలుదేరిన సగరుని కుమారులు 60 వేలమంది అశ్వం కనిపించకపోవడంతో దానిని వెదుకుతూ వచ్చి, కపిల ముని ఆశ్రమం వద్ద అది కట్టి ఉండటాన్ని చూస్తారు. దీనితో వారు కపిల ముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. తపోదీక్షలో ఉన్న కపిల ముని తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులందరినీ భస్మం చేస్తాడు. సగరుని మనుమడు భగీరథుడు తన తండ్రుల ఊర్ధ్వగ తుల కోసం తపస్సు చేసి గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుం టాడు. గంగను స్వర్గంనుంచి దిగివచ్చి తన పితరులకు మోక్షం ప్రసా దించమని వేడుకుంటాడు. అయితే తన రాకను భూమి భరించ లేదని, పరమశివుడొక్కడే భరించగలడని చెబుతుంది. భగీరథుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు.

హిందూవులు అతి పవిత్రంగా భావించే నదీమాతల్లి గంగ. దివినుండి భువికి దిగే సమయంలో గంగ తన తొలి అడుగు మోపిన స్థలంగా గంగోత్రిని భావిస్తారు. గంగోత్రి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో ఒక నగర పంచాయతీ. హిమాలయ పర్వత శ్రేణులలో 402 మీటర్ల ఎత్తులో ఉంది. గంగానది పుట్టిన ప్రాంతం హిమాలయాల్లోని గౌముఖ్‌ ప్రాంతం. ఈ నది కఠినమైన అధిరోహణా మార్గాలకు ప్రసిద్ధి చెందిన శివలింగం, తలయసాగర్‌, మేరు, భాగీరథి 3 అనే గంగోత్రి మంచు శిఖరాల సమూహంతో చుట్టబడి ఉంది. చౌఖంబా శిఖరం కింద ఉన్న ఒక వలయంనుంచి వెలువడే ఈ నది వాయువ్య దిశగా ప్రవహిస్తూ చివరకు ఆవు నోమును పోలిన ఆకృతి వద్ద ఆగిపోతుంది. అందువల్లే దీనికి గోముఖ్‌ అని పేరు వచ్చింది. గోముఖ్‌ ప్రాంతం గంగోత్రినుండి 40 కిలోమీటర్ల ఎగువన పర్వతాలలో ఉంటుంది.

శివుడు ప్రత్యక్షం కాగానే, గంగాదేవిని స్వర్గంనుంచి భూమి మీదకు తీసుకు వచ్చే ప్రయత్నంలో సహకరించమని కోరుతాడు భగీరథుడు. శివుడు అందుకు అంగీకరించి, స్వర్గంనుంచి దూకు తున్న గంగను తన జటాజూటంలో బంధించి, మెల్లగా భూమి మీదకు వదులుతాడు. ఇలా గంగాదేవి భూమి మీద తన ప్రయాణం ఆరంభించిన ప్రాంతమే గంగోత్రి. హిమాలయ పర్వత శ్రేణులలో ఛోటా చార్‌ధామ్‌గా ప్రసిద్ధి పొందిన ప్రాంతాలలో గంగోత్రి ఒకటి. భగీరథుని తప:ఫలితంగా గంగ వెలిసింది కనుక ఈ ప్రాంతంలో గంగానదిని భాగీరథి అని పిలుస్తారు. దేవ ప్రయాగ సమీపంలో గంగానదిలో అలకనందా నది ప్రవేశించే ప్రాంతం నుంచి ఈ నదిని గంగానది అని పిలుస్తారు. గంగోత్రిలో ప్రధాన దేవాలయం గంగాదేవి ఆలయం. ఈ ఆలయంలో పాలరాతితో చేసిన అమ్మవారి విగ్రహం కూర్చుని ఉన్నట్లుగా ఉంటుంది. ఆ పక్కనే భాగీరథుడి ఆలయం ఉంది. 18వ శతాబ్దపు చివరలో గుర్కా జనరల్‌ అమర్‌సింఘ్‌ థాపా ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. సెమ్వాల్‌ కుటుంబానికి చెందిన పూజారులు ఇక్కడ సంప్రదాయక పూజలు నిర్వహిస్తారు. గంగానది ఉధృతంగా ప్రవహించే ప్రదేశంలో ఆ నదీమతల్లికి హారతి ఇచ్చే దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. గంగోత్రి పరమ పవిత్రమైన క్షేత్రం కావడంతో ఇక్కడకు వచ్చే భక్తులు తమ పెద్దలకు తర్పణాలు విడుస్తారు. శ్రాద్ధకర్మలు చేస్తుంటారు. హరిద్వార్‌, హృషికేశ్‌, డెహరాడూన్‌ల నుంచి గంగోత్రికి వెళ్లవచ్చు. ఈ ప్రాంతాలనుంచి ఇక్కడకు రావడానికి ఒక రోజు పడుతుంది. కాగా, యమునోత్రినుంచి కూడా ఇక్కడకు రావచ్చు. కాని రెండు రోజుల సమయం పడుతుంది. కేదారినాథ్‌ క్షేత్రంనుంచి రుద్రప్రయాగ చేరి అక్కడినుంచి 75 కిలోమీటర్ల దూరం హిమాలయ పర్వతాలలో ప్రయాణం చేసి గంగోత్రి చేరవచ్చు.

No comments:

Post a Comment

முத்துசாமி தீட்சிதர்

மிகபெரும் பக்திமான்களை, நாயன்மார் ஆழ்வார் வழிவந்த அதிதீவிர பக்தர்களை ஒருவலையில் ஞான சித்தர்களை வெறும் சங்கீத மும்மூர்த்திகள் என அடக்கிவிட்ட ...